‘చోటీ చోటీ బాతే.. మై సితాపాప’ మహేశ్‌ బాబు ట్వీట్‌

స్టార్‌ హీరో మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా సెట్‌లో తన కుమార్తెతో సరదాగా సమయం గడిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఆయన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. సితార ఎప్పుడూ తనకు ఒత్తిడి నుంచి ఉపశమనం కల్గిస్తుందని అన్నారు. ‘చోటీ చోటీ బాతే.. మై సితాపాప’ అంటూ లవ్‌ ఎమోజీలను పోస్ట్‌ చేశారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధం తెలుపుతున్న ఈ చక్కటి ఫొటోలు సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

మహేశ్‌ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వనిదత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీస్తున్నట్లు తెలిసింది. మే 9న సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించారు. శుక్రవారం ‘చోటీ చోటీ బాతే..’ అనే పాటను విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో అగ్ర స్థానంలో ఉంది. దాదాపు 33 లక్షల మంది వీడియోను చూశారు. 1.42 లక్షల మంది లైక్‌ చేశారు.