HomeTelugu Big StoriesActors who played Lord Rama on screen: రాముడి పాత్రలో మెప్పించిన హీరోలు వీరే

Actors who played Lord Rama on screen: రాముడి పాత్రలో మెప్పించిన హీరోలు వీరే

Sree Ramudu రాముడి

Sri Rama characters in tollywood: తెలుగు సినిమా పౌరాణికాలతో ప్రారంభమయింది. రామకథతో వచ్చిన తొలి సినిమా ‘శ్రీరామ పాదుకాపట్టాభిషేకం’. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ తొలిసారి రాముని పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలువురు నటులు రాముని పాత్రలో అలరించారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇప్పటికే రాముడంటే నందమూరి తారక రామారావే.

వెండితెరపై శ్రీరాముడిగా ప్రశంసలు అందుకుని రాముడంటే ఇలాగే ఉంటాడా! అనిపించే స్థాయిలో నటించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. అసలు రామచంద్రుడి క్యారెక్టర్ చాలా ఉన్నతమైనది. ఆ పాత్రలో ఓ స్వచ్చత, ఓ సచ్చీలత, ఓ శాంత గుణం కనిపించాలి. శ్రీరాముడి పాత్రకు ఏ మేరకు నటించాలో అంతగా నటించి అద్భుతం అనిపించారు ఎన్టీఆర్. సీతా వియోగ ఘట్టంలో విషాదాన్ని, రావణ సంహారంలో కోపాన్ని, మహారాజుగా శాంతాన్నిఇలా నవరసాలను మేళవించి శ్రీరాముడి పాత్రలో లీనమై నటించారు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ తర్వాత రాముడుగా మెప్పించిన నటుడు హరనాథ్. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన
‘సీతారామకళ్యాణం’ సినిమాతో పాటు మరో ‘శ్రీరామకథ’లో హరనాథ్ కోదండ రాముడిగా మెప్పించాడు.

‘లవకుశ’ సినిమాలో లక్ష్మణుడిగా మెప్పించిన కాంతారావు ‘వీరాంజనేయ’ తో పాటు తదితర కొన్ని సినిమాల్లో రాముడిగా నటించి మెప్పించారు. ఇక రామారావు, కాంతారావు కంటే ముందే ఏఎన్నాఆర్ ఆయన నటజీవితాన్ని ‘సీతారామ జననం’ సినిమాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం.

ఇక రాముడిగా శోభన్ బాబుది ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’లో
శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబుకే దక్కింది. ఈసినిమాలో రామయ్య తండ్రీ ‘ఓ రామయ్య తండ్రీ’ మా సామి వంటి నీవేలే రామయ్య తండ్రీ.. అంటూ వచ్చే పాట ఇప్పటికీ తెలుగువారి మదిలో దేవుడిగా రాముని ఔన్నత్యాన్ని తెలుపుతూనే ఉంది.

శోభన్ బాబు తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మరో రామాయణ గాధ ‘సీతా కళ్యాణం’ ఈ చిత్రంలో జయప్రద సీతగా నటించగా.. మలయాళ నటుడు రవి శ్రీరాముడిగా మెప్పించాడు. ఉత్తారాది వాళ్లకు అయోధ్య ఎలాగో దక్షిణాది వారికి భద్రాచలం అంతే. ఇక భద్రాచలం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు వెండితెరను రామమయం చేశాయి. ఈ భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీరామదాసు సినిమాలో సుమన్ శ్రీరాముడిగా అలరించాడు.

రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం అనే అర్థం వుంది. తండ్రి మాట కోసం రాముడు వనవాసం చేశాడు. ఇంతలో సీతాపహరణం జరిగింది. రావణ సంహారం చేసి సీతను కైవసం చేసుకుంటాడు రాముడు. ఇదీ మూడు ముక్కల్లో రామాయణం. శ్రీకాంత్ ‘దేవుళ్లు’ సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించడం విశేషం. రామాయణంపై వచ్చిన మరో అద్భుత వెండితెర దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’. లవకుశ సినిమాకు రీమేక్ గా తీసిన ఈసినిమాలో శ్రీరాముడిగా బాలకృష్ణ అద్భుతాభినయం చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో సాత్వికాభినయం చేసి మెప్పించారు.

ఇక నందమూరి మూడో నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్.. ఆయన నటజీవితాన్ని రామాయణం సినిమాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషమనే చెప్పాలి. ఇలా మూడు తరాల హీరోలు వెండితెర రాముడిగా మెప్పించడం కూడా ఒక అద్భుతం.

ఇక యంగ్‌ హీరోలు కూడా వెండితెరపై శ్రీరాముడిగా కనిపించి మెప్పించారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ కూడా శ్రీరామునిగా మెప్పించారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించారు. రామాయణాన్ని కొత్తగా చూపించాలి అని దర్శకుడు చేసిన ప్రయోగం పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. అయితే శ్రీరాముడిగా ప్రభాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణం’ తెరకెక్కించననున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 5 భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక టాలీవుడ్‌లో కూడా అత్యంత భారీ స్థాయిలో రామాయణం తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చేస్తున్న సినిమా రామాయణం ఆధారంగా తీయబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వెండితెరపై ఎప్పటికప్పుడు శ్రీరాముడిగా యంగ్‌ హీరోలు నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తునే ఉన్నారు.

నాటి తరమే కాదు.. నేటి తరమూ రాముడు గొప్పవాడని ఒప్పుకుంటారు. రాముడిది ఒకే మాట. ఒకే బాణం.. ఒకే భార్య.. ఒకే విధానం. ప్రస్తుతం సమాజం వెళ్తున్న మార్గాన్ని అనుసరించి చెబితే ‘రాముడి వ్యక్తిత్వం సమాజానికి ఎంతో అవసరం. ఇదీ వెండితెరపై తెలుగు రాముడి లీల.

Recent Articles English

Gallery

Recent Articles Telugu