తాడేపల్లిగూడెంలో చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి.. నాలుగేళ్లయినా కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఉండి ఉంటే.. 90శాతం గ్రాంటు వచ్చేది. రాష్ట్రానికి ఇచ్చిన రూ.1500 కోట్లతో ఎలక్ట్రిసిటీ కేబుల్‌ కూడా రాదు. ఆ నిధులకు యూసీలు ఇవ్వలేదని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఖాతాలో వేసిన సొమ్మును వెనక్కి తీసుకోవడం చట్ట విరుద్ధం. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఏపీకి ఎందుకు ఇవ్వరు అని అడిగాం. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు కర్మాగారం రాకుండా అడ్డుపడుతున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఇతర నగరాల్లో ర్యాపిడ్‌, బుల్లెట్‌ రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్‌లో మన ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశ చరిత్రలో నూతన అధ్యాయం. రాష్ట్రం కోసం పోరాడితే కటకటాలు తప్పవని వైసీపీ ఈ ఎంపీలు పారిపోయి వచ్చారు. మోడీ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతోంది. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం.. అంతిమంగా గెలిచేది ధర్మం, న్యాయమే.

దేశంలో అందరికంటే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం. మానవ హక్కులు సాధించుకునే శక్తి మనకు ఉంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతి మన కలల రాజధానిగా ఉండాలి. అమరావతిని దేశంలో అన్ని నగరాల కంటే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. అన్న క్యాంటీన్లు పెట్టాం, అక్టోబరు 2 నుంచి నిరుద్యోగ యవతకు రూ.వెయ్యి భృతి ఇవ్వబోతున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.. అని చంద్రబాబు వెల్లడించారు. ఈ సభలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, కళా వెంకట్రావు, లోకేశ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, సుజయకృష్ణ రంగారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు