సీఎం జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తాం: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిన అవసరముందని అన్నారు. మంచి పట్టుదల ఉన్న యువ నాయకుడు, ఏపీ సీఎం జగన్‌తో అది సాధ్యమవుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసానికి వచ్చిన కేసీఆర్‌.. మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను, జగన్‌ సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగాలన్నా..రతనాల సీమగా మారాలన్నా గోదావరి జలాలు రావాల్సిన అవసరముందన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని.. ఆ నీటిని వాడుకుంటే బంగారుపంటలు పండుతాయన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సీఎం జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తానని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధిలో జగన్‌ కీలక పాత్ర పోషిస్తారన్నారు.

తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదరాజస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. తిరుగు ప్రయాణంలో నగరిలోని ఎమ్మెల్యే రోజా ఇంటికి వచ్చారు. ఆమె ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. సుమారు రెండు గంటల పాటు అక్కడ గడిపారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లనున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులు ఉన్నారు.