టీఆర్‌ఎస్‌పై మరోసారి విశ్వాసం ఉంచిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సీఎం సమాధానమిచ్చారు. పేదరికంతో పాటు నిర్లక్ష్యం వల్ల చాలామంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదని కేసీఆర్ చెప్పారు. ఎవరూ కోరకుండానే మంచి ఉద్దేశంతో కంటివెలుగు ప్రవేశపెట్టామన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని సునేత్ర పేరుతో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యంగా వదిలేశాయని కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేయకపోతే ప్రజలు మళ్లీ తమకు ఎందుకు ఓటు వేశారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. పహాణి, ఆర్‌వోఆర్‌లు అవసరం లేకుండా బ్యాంకుల్లో రైతులకు రుణాలు అందాలన్నారు. ఎలాంటి దస్త్రాలు లేకుండా కేవలం ధరణి వెబ్‌సైట్ ఆధారంగానే రైతులకు రుణాలు అందాలని సీఎం ఆకాంక్షించారు. రైతే రాజు అయ్యే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కొందరు ప్రశంసిచారని, రైతుబీమా పరిహారం బాధిత కుటుంబాలకు కేవలం 10 రోజుల్లో అందుతోందని చెప్పారు. కార్యాలయాలు తిరగకుండా, పైరవీలు చేయకుండానే బాధిత కుటుంబం ఖాతాలో పరిహారం సొమ్ము జమ అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ అధికారులను కూడా నియమించలేదని సీఎం మండిపడ్డారు.
రుణాలపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఎన్నివిడతల్లో మాఫీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. కొన్ని పనుల ప్రారంభానికి ఎన్నికల కోడ్ అవరోధంగా మారిందన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కాగానే పనులు, సంస్కరణల్లో వేగం పెరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా పోయిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోయలు వలస రావడం కూడా పోడు భూముల విషయంలో సమస్యగా మారిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తామని చెప్పారు.
ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం సాహసం చేయబోతోందని కేసీఆర్ చెప్పారు. గతంలో సర్వే ప్రకారం 8 లక్షల ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందని తేలిందన్నారు. ఇల్లు అవసరమైనవాళ్లు ఎంతమంది ఉన్నారో కచ్చితమైన లెక్కలను త్వరలో తీస్తామని చెప్పారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వ విధానాల మేరకు తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. పేదవాళ్ల పేర్లను లాటరీలో వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. 2.70 లక్షల రెండు పడకగదుల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ లాటరీ విధానానికి మినహాయింపు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా టీఆర్‌ఎస్ కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని తెలిపారు.













