ఆంధ్రప్రదేశ్‌లో వలసల టైమ్ నడుస్తోంది. తాజాగా ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌లో కీలక నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పెద్దసంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పసుపు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. మురళి రాకతో రాజాంలో టీడీపీ బలపడిందన్న చంద్రబాబు టికెట్ ఎవరికిచ్చినా పార్టీ బలోపేతానికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆయన రాకతో టీడీపీకి మరింత బలం వచ్చిందన్నారు. తమ్ముడు కొండ్రు మురళికి పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.
మరోవైపు చంద్రబాబు తనను పార్టీలో చేర్చుకోవడంపై కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ వారసత్వాన్ని చంద్రబాబు సమర్ధంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు. విభజన తర్వాత ఏపీని అభివృద్ధిలో నడిపే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. పార్టీ అందరికీ కన్న తల్లిలాంటిదని, కొండ్రుమురళి పార్టీ చేరికలో ప్రతిభా భారతి చూపిన స్ఫూర్తి, చొరవ ప్రతి ఒక్కరూ చూపాలన్నారు. ప్రధాని మోడీతో పాటు వైసీపీ నేతల తీరుపైనా మండిపడ్డారు. శ్రీకాకుళంలో అన్ని సీట్లు టీడీపీ గెలుచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.