ఎస్పీబీ ఆరోగ్యంగానే ఉన్నారు!

సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో  ఫేక్ ప్ర‌చారం ప‌లువురిని క‌ల‌త‌కు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అస‌లు నిజానిజాలు తెలుసుకోకుండా అస‌త్య ప్ర‌చారానికి ఆస్కారం పెరిగింది ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో. గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం విష‌యంలోనూ అలాంటి ఓ ప్ర‌చారం ఆయ‌న్ని తీవ్రంగా క‌ల‌త‌కు గురి చేసింది. ఇటీవ‌లి కాలంలో ఎస్పీబీ ఆరోగ్యం బాలేద‌ని, అందువ‌ల్ల‌నే ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని ప్ర‌చారం సాగింది. దీంతో నేరుగా ఎస్పీబీనే ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకొచ్చారు. అక్క‌డ ఓ వీడియోని పోస్ట్ చేశారు. త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఫేక్ ప్ర‌చారం త‌గ‌ద‌ని కోరారు. 
 
దగ్గు, జలుబు వచ్చి డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా ఇలాంటి ప్ర‌చారం చేసేస్తున్నారు. దీంతో శ్రేయోభిలాషులు కంగారుగా ప‌రామ‌ర్శించార‌ని ఎస్పీబీ తెలిపారు. ప్ర‌ద‌ర్శ‌న‌ల ర‌ద్దున‌కు కార‌ణం.. నా సోదరి గిరిజ కన్ను మూశార‌ని, కుటుంబంతోనే దాదాపు 12 రోజులు ఉండ‌డం వ‌ల్ల కుద‌ర‌లేద‌ని తెలిపారు. సెప్టెంబరు 2న బెంగళూరులో ప్రదర్శన ఇచ్చాను. ప్రస్తుతం ఆర్ ఎఫ్‌సీలో `స్వరాభిషేకం` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాన‌ని ఎస్పీబీ తెలిపారు. అన‌వ‌స‌రం దుష్ప్ర‌చారంతో బాధ‌పెట్టొద్ద‌ని కోరారు.