HomeTelugu Trendingషిరిడీ ఆలయంపై వివాదం..!

షిరిడీ ఆలయంపై వివాదం..!

2 15
మహారాష్ట్రలో షిరిడీ సాయి జన్మభూమిపై సరికొత్త వివాదం నడుస్తోంది.. పాథ్రీయే సద్గురు సాయిబాబా జన్మస్థలం అంటూ స్థానికులు వాదిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఆలయం కొలువై పూజలు అందుకుంటోంది. 1999లో అక్కడ శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. భక్తులు పెద్ద మొత్తంలో ఆలయానికి వస్తుండడంతో ఇటీవల శివసేన కూటమి సర్కారు పాథ్రిలోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించింది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. పాథ్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ప్రకటనపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా రేపటి నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ట్రస్ట్.. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం షిరిడీ గ్రామస్తులతో సమావేశం అవుతోంది. మహారాష్ట్రలోని షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్బాని జిల్లాలో పాథ్రి అనే ఊరు ఉంది. ఇక్కడే సాయిబాబా జన్మించారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే 1854లో 16 ఏళ్ల వయస్సులో సాయి.. షిరిడీకి వచ్చారని.. తొలుత ఓ వేపచెట్టుకింద సాయి బాబా కనిపించారని మరోవాదన ఉంది.

వాస్తవానికి పాథ్రి ఆలయం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు.. షిరిడీలో కొలువైన సాయిబాబాను దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలుస్తుంటారు. అయితే, షిరిడీతో సమానంగా పాథ్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయాన్ని షిరిడీ సాయిబాబా సంస్థాన్ తప్పుబడుతోంది. పాథ్రిని అభివృద్ధి చేస్తే షిరిడీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా రేపు షిరిడీ బంద్‌కు పిలుపునిచ్చింది. అంతే కాదు, రేపటి నుంచి షిరిడీ సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ట్రస్ట్ నిర్ణయంతో ఆలయానికి వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది. అటు ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!