తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా బాధితులు


తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఇప్పటికే ప్రజా రవాణాను నిలిపేశాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏపీ, తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏపీ, తెలంగాణలో జనతా కర్ఫ్యూని ఈ నెల 31 వరకూ కొనసాగిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరాతూ.. నిత్యావసర వస్తువుల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ఆదేశాలు జారీచేశారు. పాలు, కూరలు, నిత్యావసర వస్తువులు, ఔషధ దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు.

ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితులు 7 ఉండగా.. తెలంగాణలో 33కి చేరింది. తాజాగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన విశాఖకు చెందిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు. తెలంగాణలో నేడు ఒక్కరోజే 6 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతోంది. ఇవాళ మరో ఇద్దరు కరోనాతో మృతిచెందారు. కాగా ఇప్పుటికే ప్రపంచ వ్యాప్తంగా 15వేల మంది మరణించారు.