నోట్ల రద్దుతో సినిమా కలెక్షన్స్ నిల్!

నల్లధనాన్ని రూపుమాపే దిశగా కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో
టాలీవుడ్ తో పాటు అన్ని ఉడ్‌లు ఉలుక్కుపడుతున్నాయి. రోజుకు కొన్ని కోట్లలో లావాదేవీలు
జరిగే సినిమా ఇండస్ట్రీకి మోడీ తాజా నిర్ణయం రూ. 1000, 500 నోట్ల బ్యాన్ గుబులు రేపింది.
చిత్ర పరిశ్రమలో బ్లాక్ మనీ బాగా చెలామణి అవుతుటుందని సాధారణ అభిప్రాయం. ఇప్పుడు
జరుగుతోన్న ఐ‌టి దాడులు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. అయితే నోట్ల రద్దు టాలీవుడ్ పై
ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద పడడంతో
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల వద్ద రూ.500, రూ.1000
నోట్లు ఉండడం.. అవి చెల్లకుండా పోవడంతో థియేటర్ల వంక చూసే పరిస్థితి కనిపించడంలేదు.
మరో నెలరోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఓ పెద్ద హీరో
సినిమా విడుదలవుతుందంటే థియేటర్ దగ్గర ఉండే జనాల సంఖ్య కంటే బ్యాంకులు. పోస్టాఫీసులు
వద్ద ఎక్కువ జనాలు కనిపించడం విశేషం. జనమంతా బ్యాంకుల వద్ద ఉంటే థియేటర్ కు ఎవరు
వస్తారని ఓ ఎగ్జిబిటర్ వాపోయారు. మార్కెట్ లో కొత్త నోట్ల చెలామణి పెరిగేవరకు పరిస్థితి ఇలానే
ఉంటుందని మరో ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ తెలిపారు. ఇటీవల విడుదలయిన ‘సాహసం శ్వాసగా
సాగిపో’ సినిమాకు మొత్తం కలిసి 40 శాతం కలెక్షన్స్ కూడా నమోదు కాలేదని సమాచారం.
‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమా తరువాత చైతు నటించిన సినిమా కావడంతో కనీసం 80శాతం
కలెక్షన్స్ నమోదుకావాలి. నగరాల్లో ఇటువంటి సినిమాకు 100 శాతం వసూళ్లు రావాలి కానీ ఈ
సినిమాకు 40 నుండి 50 శాతం మాత్రం కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక గ్రామాల్లో దీని సంఖ్య ఇంకా పడిపోయిందని స్పష్టం చేశారు. కొత్త సినిమాల సంగతి ఇలా ఉంటే
ఆల్రెడీ థియేటర్లలో ఉన్న సినిమాల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. వాటికి 10 శాతం వసూళ్లు
కూడా రావట్లేదు. దీంతో ఈ నెల విడుదల కావాలనుకున్న సినిమాలు ఒకదాని తరువాత ఒకటి
వాయిదా పడుతూనే ఉన్నాయి. అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’, విశాల్ ‘ఒక్కడొచ్చాడు’
వంటి సినిమాలు వెనక్కి తగ్గాయి.