రజనీకాంత్‌పై అళగిరి సంచలన వ్యాఖ్యలు

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రజనీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని, ఆయన తీరు విస్మయానికి గురిచేసిందని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు.

ఈశాన్య రాష్ట్రాలకున్న ప్రత్యేక ప్రతిపత్తిని మాత్రం కేంద్రం ఎందుకు తొలగించట్లేదో తెలుసుకోవాలనుకుంటున్నానని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అళగిరి వ్యాఖ్యానించారు. ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంగానే జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశారని ఆరోపించారు. ఇలాంటి ద్వంద్వ నీతిని రజనీకాంత్‌ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. కోట్లాది మంది హక్కులను హరించిన మోడీ, అమిత్ షా కృష్ణార్జునులు ఎలా అవుతారన్నారు. మరోసారి మహాభారతాన్ని చదివి అందులోని అంశాలను క్షణ్నంగా అర్థం చేసుకోవాలని అళగిరి వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీర్‌కు 370 రద్దు చేయడంపై రజనీకాంత్‌ చెన్నైలో జరిగిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన ‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకావిష్కరణ సభలో స్పందించారు. ‘మిషన్‌ కశ్మీర్‌ విజయవంతమైనందుకు హృదయపూర్వక అభినందనలు. పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతం. అమిత్‌ షా-మోడీ ఇద్దరూ కృష్ణార్జునుల వంటి వారు. ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడు అన్నది మాత్రం వారికే తెలుసు’ అని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు.