ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సాహో’ ఫస్ట్‌లుక్‌

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రభాస్‌ 39వ పుట్టినరోజు. ముందుగా చెప్పినట్టుగానే తన బర్త్‌డే నాడు ప్రభాస్‌ ‘సాహో’ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌ను అభిమానులకు ఇచ్చేశారు. చాప్టర్‌ 1 పేరిట ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. అబుదాబిలో 30 రోజుల పాటు చిత్రీకరించిన సన్నివేశాలను ఇందులో చూపించారు. పోలీసుల కార్లను ప్రత్యేకంగా రూపొందించడం, కారు ఛేజింగ్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఈ టీజర్‌ ద్వారా తెలుస్తోంది.

చివర్లో ప్రభాస్‌ స్టైల్‌గా నడుచుకుంటూ రావడం, బైక్‌పై స్టంట్స్‌ చేయడం హైలైట్‌గా నిలిచాయి. దాదాపు 400 మంది టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేశారు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కూడా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించినట్లు టీజర్‌లో చూపించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటులు జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, ఎవ్లిన్‌ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2019లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.