దేవిశ్రీ ప్రసాద్‌కు డాన్స్‌ నేర్పిస్తున్న సితార..వీడియో వైరల్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌కు డ్యాన్స్‌ నేర్పిందట. ‘మహర్షి’ మూవీ షూటింగ్‌ చెన్నైలో జరుగుతున్న సమయంలో సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యలతో దేవిశ్రీ కొంత సమయం గడిపిన సంగతి తెలిసిందే. వారిని తన మ్యూజిక్‌తో మెప్పించే ప్రయత్నం చేశానని, చిన్నారులు ఎంతో నవ్వించారని ఆయన చెప్పారు. కాగా అప్పుడు తీసిన ఓ వీడియోను దేవిశ్రీ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో ఆయన ‘శ్రీమంతుడు’ లోని ‘చారుశీల..’ పాట పాడుతుంటే సితార, ఆద్య ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్నారు. ‘ఇది ‘మహర్షి’ అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం.. మొదటి పాట మార్చి 29న విడుదల కాబోతోంది. అప్పటి వరకు జూనియర్‌ ‘మహర్షి’ లు నాకు డ్యాన్స్‌ నేర్పుతున్న ఈ క్యూట్‌ వీడియోను ఎంజాయ్‌ చేయండి’ అని దేవిశ్రీ పేర్కొన్నారు.

‘మహర్షి’ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అల్లరి నరేష్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వనిదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మాతలు. రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. కాగా ఈ సినిమాను మే 9న ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.