దిల్‌రాజుకు హెచ్ఎం రెడ్డి స్మార‌క అవార్డ్‌!

”చలన చిత్ర రంగంలో ఆహ్లాదకరమైన సినిమాలు తీస్తున్న దిల్‌రాజు చూడడానికి హీరోలా ఉంటారు. ఆయ‌న‌ హీరోగా చేస్తానంటే సినిమా తీస్తా” అన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ మురళీమోహన్‌. సినిమా రంగానికి ఎంతో మందిని పరిచయం చేస్తున్న గొప్ప నిర్మాత దిల్‌రాజు అని కొనియాడారు. రవీంద్రభారతిలో ఆకృతి, ఆల్‌ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో తొలి తెలుగు టాకీ దర్శక నిర్మాత హెచ్‌ఎం రెడ్డి స్మారక అవార్డును నిర్మాత దిల్‌రాజుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి దిల్‌రాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిల్‌రాజు గొప్ప సినిమాలు తీస్తున్నారన్నారు. తెలుగు సినిమా రంగానికి మేలు చేసే సినిమాలు రావాలని ఆకాంక్షించారు.
మురళీమోహన్ మ‌రిన్ని సంగ‌తులు మాట్లాడుతూ.. ”సినీ నిర్మాతలకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఎలాంటి బాధ్యతలైనా చిరునవ్వుతో స్వాగతించే మనస్తత్వం దిల్‌రాజుది. ఎంతో మంది దర్శకులను, టెక్నిషీయన్లను పరిశ్రమకు పరిచయం చేస్తున్నారాయ‌న‌. సంగీత అభిరుచి ఉన్న నిర్మాత కూడా. ఆయన సినిమాలన్నీ సంగీతం పరంగా హిట్‌ అయ్యాయి“ అన్నారు. దిల్‌రాజు హీరోగా నటిస్తే నిర్మాతగా సినిమాను తీస్తానన్నారు”.
ప్ర‌తిష్ఠాత్మ‌క హెచ్ఎం రెడ్డి అవార్డు గ్ర‌హీత దిల్‌రాజు మాట్లాడుతూ.. ”తొలి టాకీ దర్శక, నిర్మాత హెచ్‌ఎం రెడ్డి పేరిట నెలకొల్పిన అవార్డు ద‌క్క‌డం ఆనందంగా ఉంది” అన్నారు.
సభాధ్యక్షుడిగా ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ వ్యవహరించారు. కార్యక్రమంలో నటి కవిత, సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్‌, ఇండియన్‌ ఐడల్‌ శ్రీరామచంద్ర, ఆకృతి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
CLICK HERE!! For the aha Latest Updates