జైలులో హీరో గారి స్పెషల్ సదుపాయాలు!

మలయాళీ నటి భావనను కిడ్నాప్ చేసి వేధించిన వ్యవహారంలో సూత్రధారిగా అరెస్టు అయిన స్టార్ హీరో దిలీప్ కు జైల్లో సకల సదుపాయాలను కల్పిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కస్టడీ నేపధ్యంలో ఆలువా జైలులో ఉంటున్నాడు దిలీప్. అక్కడ అతడికి వీఐపి ట్రీట్మెంట్ దొరుకుతోందని అంటున్నారు. ఆ జైలులో నుండి విడుదలయిన ఓ ఖైదీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.
‘జైల్లోని ఖైదీలు తినే ఆహారం కాకుండా పోలీసులే దిలీప్ కోసం ప్రత్యేకంగా భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే పగలు మొత్తం అతడు జైలు మొత్తం ఫ్రీగా తిరగొచ్చు. జైలు అధికారుల కోసం ఏర్పాటు చేసిన టీవీ కూడా చూడొచ్చు. అధికారులు ఉపయోగించే బాత్రూంనే దిలీప్ కూడా వాడతాడు. ఓ ఖైదీలా కాకుండా సకల సదుపాయాలు పొందుతూ చాలా స్వతంత్రంగా జీవిస్తున్నాడు దిలీప్. రాత్రిపూట పడుకోవడానికి మాత్రమే అతడు సెల్ లోకి వెళతాడు’ అని సదరు ఖైదీ వెల్లడించాడు. ఈరోజుతో దిలీప్ కస్టడీ పూర్తికానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిలీప్ ను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.