రానా రాజకీయాలు మొదలయ్యాయి!

రానా రాజకీయాలు ఏంటి..? అనుకుంటున్నారా..? అవునండీ నిజంగానే రానా రాజకీయాలు చేస్తున్నాడు. అయితే అది రీల్ లైఫ్ లో.. రానా హీరోగా దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది రాజకీయ నేపధ్యంలో సాగే కథ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపూర్ లో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో రానా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నట్లు అతడిని చూడడానికి జనం ఎగబడినట్లుగా ఉంది.

గతంలో కూడా రానా ‘లీడర్’ అనే సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. మరోసారి తన రాజకీయాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమాలో రానా సరసన కాజల్ నటిస్తుండగా, మరో కీలక పాత్రలో కేథరిన్ నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.