‘వర్మ’పై స్పందించిన బాల

తెలుగు హిట్‌ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో స్టార్‌ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీకి బాల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఆగిపోయింది. ‘వర్మ’ లోని ద్వితీయార్థం తెలుగు ‘అర్జున్‌రెడ్డి’కి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని, అందువల్లే సినిమాను విడుదల చేయడం లేదని ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ గురువారం సాయంత్రం ప్రకటించింది. సినిమా నిర్మాణ తీరు సంతృప్తికరంగా లేదు.. అందుకే తెరపైకి తీసుకురావడం లేదని తెలిపింది. తెలుగు మాతృకకు ప్రతిబింబం వలే ఉండేలా ధృవ్‌ తో మరోసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు పేర్కొంది.

కాగా నిర్మాణ సంస్థ దర్శకుడు బాల పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సినిమాపై బాల తాజాగా ప్రకటన విడుదల చేశారు. ‘వర్మ’ నిర్మాతలు తప్పుడు ప్రకటన విడుదల చేయడంతో.. వివరణ ఇవ్వాలని నాపై చాలా ఒత్తిడి వచ్చింది. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ లేని కారణంగా నాకు నేను స్వతహాగా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నా. నిర్మాతలతో 2019 జనవరి 22న నేను చేసుకున్న ఒప్పంద పత్రం చూడండి. ధ్రువ్‌ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపి, ఊరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

‘వర్మ’ను మరోసారి తీస్తున్న విషయం పై తనకు స్పష్టత లేదని ఇందులో హీరోయిన్‌ పాత్ర పోషించిన మేఘా చౌదరి మీడియాతో అన్నారు. ‘ఈ విషయం గురించి నాకు తెలియదు. నేను నిర్మాతలతో మాట్లాడాలి’ అని చెప్పారు