క్యాన్సర్‌ నాలుగో దశ.. బతికే అవకాశం తక్కువన్నారు: సొనాలి

బాలీవుడ్‌ నటి సొనాలి బింద్రే తాను బతికే అవకాశం కేవలం ముప్పై శాతం ఉందని అప్పట్లో వైద్యులు చెప్పారని అన్నారు. ఆమె క్యాన్సర్‌ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జులైలో సొనాలి ఈ విషయాన్ని అభిమానులకు వెల్లడించారు. ఆమెకు న్యూయార్క్‌లో కీమోథెరపీ జరిగింది. ఇటీవల తిరిగి ముంబయి వచ్చారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. బాధితుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి సొనాలి ముందడుగు వేశారు. క్యాన్సర్‌ ఉందని తెలిసిన కొత్తలో తన భావాల్ని ఓ వేదికపై పంచుకున్నారు.

‘చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్లినప్పుడు క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని వైద్యులు చెప్పారు. బతికే అవకాశం కేవలం ముప్పై శాతం ఉందని అన్నారు. న్యూయార్క్‌ వెళ్లాలని నా భర్త గోల్డీ బెహెల్‌ నిర్ణయించుకున్నారు. నాకు వెళ్లడం ఇష్టం లేదు. విమానంలో కూడా ఆయనతో పోట్లాడుతూనే వెళ్లా. ‘నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మనకు ఇక్కడ మంచి
వైద్యులు ఉన్నారు. నన్నెందుకు వేరే దేశానికి తీసుకెళ్తున్నావు?’ అని గొడవపడ్డా. నా ఇంటిని, ఊరిని చాలా మిస్‌ అవుతా అనుకున్నా. ఓ మూడు రోజులు ఉండి వచ్చేద్దాం అనుకున్నా. కానీ ఏమైందో నాకే తెలియదు. చూద్దాం, ప్రయత్నిద్దాం అన్నట్లు ఉండిపోయా. న్యూయార్క్‌లో అడుగుపెట్టాం. తర్వాతి రోజు వైద్యుల్ని కలిశాం. అన్ని పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని, బతికే అవకాశం ముప్పై శాతం మాత్రమే ఉందని చెప్పారు. నిజంగా ఆ మాటలతో నాకు బుద్ధి వచ్చింది. ఆ క్షణం గోల్డీను చూసి.. ‘నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు’ అన్నా’ అని సోనాలి గుర్తు చేసుకున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates