డ్రగ్స్ తో బుల్లితెర నటులకు లింకులు!

ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం వెండితెర నుండి బుల్లితెరకు కూడా పాకింది. వెండితెరకు మాత్రమే పరిమితమనుకున్న డ్రగ్స్ లింకులు ఇప్పుడు బుల్లితెర నటుల్లో కూడా వెలుగు చూస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీల కోసం పలువురు నటులు పెద్ద మోతాదులో డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు బుల్లితెర నటులకు కూడా నోటీసులు జారీ చేయడానికి సిట్ అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. డ్రగ్స్ ముఠాకు సంబంధించిన
జీషాన్ అలీ, నోవా విలియమ్స్ వంటి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని విచారించగా కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. జీషాన్ అలీ ఈవెంట్ మేనేజర్ గా కనిపిస్తూ డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటాడు.

బడాబాబులను గుర్తించి వారికి డ్రగ్స్ ను అలవాటు చేస్తాడు. సౌత్ ఆఫ్రికా నుండి తెప్పించిన ప్రత్యేకమైన డ్రగ్స్ ను సినీ నటులతో పాటు కొంతమంది టీవీ సీరియల్స్ లో పని చేసే వారికి కూడా సరఫరా చేశామని సిట్ అధికారుల ముందు జీషాన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొందరు సినీ గాయకుల పేర్లను కూడా వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో సినీ నటుల విచారణ ముగిసిన తరువాత బుల్లితెర నటుల విచారణ మొదలుకానుంది.