డిసెంబర్‌లో అంబానీ ఇంట పెళ్లి బాజాలు

ముఖేష్‌ అంబానీ – నీతా అంబానీల ముద్దుల కూతురు ఈషా అంబానీ పెళ్లి డిసెంబర్‌ 12న ఆనంద్‌ పిరమాల్‌తో జరగనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు నేడు అధికారికంగా ప్రకటించాయి. “ముఖేష్‌-నీతా అంబానీల స్వగృహంలో డిసెంబర్‌ 12వ తేదీన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈషా-ఆనంద్‌ల వివాహం జరగనుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వేడుక జరగనుంది.

వివాహానికి ముందు వేడుకను ఇరు కుటుంబాలు ఉదయ్‌పూర్‌లో సంప్రదాయం ప్రకారం‌ నిర్వహిస్తామని ఇరు కుటుంబాలు ఒక ప్రకటనలో తెలిపాయి. నిన్న అంబానీ కుటుంబ సభ్యులు ముంబయిలోని సిద్ధివినాయక ఆలయంలో తొలి ఆహ్వాన పత్రాన్నిఉంచి పూజలు జరిపారు. జూన్‌లో ఆకాశ్‌ అంబానీ – శ్లోకా మెహతా నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను కూడా ఇక్కడే ఇచ్చారు. ఆనంద్‌-ఈషాలు చిన్నప్పటి నుంచి మిత్రులు. ఇరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.