జనవరి నాటికి సర్వం సిద్ధంకండి: జగన్

విశాఖపట్టణంలో వైసీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విశాఖలో జరుగుతున్న విషయం తెలిసిందే. మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని సమావేశంలో జగన్‌ పిలుపునిచ్చారు. పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజక వర్గాలు, బూత్‌ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రతీ నియోజకవర్గ సమన్వయకర్త.. ప్రతిరోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని జగన్‌ పేర్కొన్నారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పాటు ఆయా బూత్‌లకు చెందిన కార్యకర్తలు ఆయా కుటుంబాలతో మమేకం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో భాగం‍గా సమస్యలు, ఇతరత్రా అంశాలు గుర్తించాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం తక్కువగా ఉందని, ఇదే ఆఖరి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బూత్‌ కమిటీతో సమీక్ష చేసుకుని, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలపై దృష్టి పెట్టాలన్నారు.

పార్టీ నిర్దేశించిన మొదటి 50 బూత్‌ల సందర్శన మొదటి నెలలోనే పూర్తి చేయాలని జగన్‌ పేర్కొన్నారు. దీంతో పాటుగా నియోజక వర్గాలు, మండలాల్లోని బూత్‌ మేనేజర్లు, బూత్‌ కమిటీలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్కడ లోపాలు కనిపించినా సరే వెంటనే సరిద్దాలని కోరారు. ప్రతీ 30 నుంచి 35 కుటుంబాలకు ఒక బూత్‌ కమిటీ సభ్యుడి
చొప్పున కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా నవరత్నాల ద్వారా జరిగే మేలును వివరిస్తూ రూపొందించిన పోస్టర్‌ను జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. నవరత్నాలు పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు దోహదం చేశాయని వైఎస్‌ జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటింటికి నవరత్నాలను చేర్చాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని గుర్తు చేశారు. నవరత్నాలతో ప్రతీ కుటుంబానికి ఎలాంటి మేలు కలుగుతుందనే అంశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని జగన్‌ పేర్కొన్నారు. ప్రజలందరి నోళ్లలో నవరత్నాలు నానేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.