తనుశ్రీ ఫొటోలు కాల్చి నానాకు మద్దతు తెలిపిన మహిళలు

నటి తనూశ్రీ- నానా పటేకర్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్ల క్రితం ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నానాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తనూశ్రీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొంత మంది తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో కూడా మీటూ ఉద్యమం బలపడుతోంది.

ఇదిలా ఉండగా మహారాష్ట్ర మహిళా రైతులు, వితంతువులు తనూశ్రీపై మండిపడుతున్నారు. నానా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తూ ఆమె ఫొటోలను తగులబెడుతున్నారు. ‘నానా మాకు పితృ సమానులు. అప్పుల బాధ తట్టుకోలేక భర్తలు ప్రాణాలు తీసుకుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మాకు ఓ తండ్రిలా అండగా నిలిచారు. కరువుతో అల్లాడుతున్న మా లాంటి ఎంతో మంది వ్యక్తులకు ఆయన చేయూత అందించారు’ అంటూ ఓ మహిళ పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలోని విదర్భ లాంటి కరువు ప్రాంతాల్లోని రైతులకు అండగా ఉండేందుకు నానా పటేకర్‌ నామ్‌ ఫౌండేషన్‌ అనే సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే.