HomeTelugu Big Storiesరివ్యూ: ఫిదా

రివ్యూ: ఫిదా

నటీనటులు: వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్, రాజా, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: శక్తి కాంత్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కావడం, సినిమా టీజర్స్, ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మరి అంచనాలను ఏ మేరకు అందుకుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
తన అన్నయ్య పెళ్లి కోసం ఇండియా వస్తాడు వరుణ్(వరుణ్ తేజ్). అతడికి డాక్టర్ గా అమెరికాలోనే సెటిల్ అవ్వాలనేది ఆలోచన. ఇండియాకు వచ్చిన వరుణ్ కు పెళ్లికూతురు చెల్లెలు భాను(భానుమతి) తో పరిచయం ఏర్పడుతుంది. భానుకి ఊరు, ఇల్లు తప్ప మరొక ప్రపంచం తెలియదు. తనను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా తనతో పాటు ఊర్లోనే ఉండిపోవాలనుకుంటుంది. మరి రెండు వేర్వేరు స్వభావాలు కలిగిన వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది..? ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
సాయి పల్లవి
కథ, కథనం
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్:
క్లైమాక్స్ సన్నివేశాలు
సెకండ్ హాఫ్ లో సాగతీత

విశ్లేషణ:
తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి, అమెరికాలో ఉండే అబ్బాయికి మధ్య జరిగే కథే ‘ఫిదా’. ఈ పాయింట్ ను తీసుకొని తెరపై చాలా అందంగా ఆవిష్కరించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. చాలా కాలం తరువాత ఓ మంచి అందమైన, ఆహ్లాదకరమైన ప్రేమ కథను తెరపై చూస్తున్నామనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కేవలం యూత్ కు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడు.
భాన్సువాడ అనే ప్రాంతాన్ని చాలా అందంగా చూపించారు. సినిమా మొదటి భాగం మొత్తం కూడా సహజంగా, మన వూర్లో ఓ పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో.. కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య నడిచే సంభాషణలు, సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. క్లైమాక్స్ సన్నివేశాలను చాలా తొందరగా ముగించేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది.
సాయి పల్లవి తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తెలంగాణ యాసలో ఆమె చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. వరుణ్ తేజ్ తన పెర్ఫార్మన్స్ తో, లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల హావభావాల విషయంలో తడబడ్డాడు. నటుడు సాయి చంద్ హీరోయిన్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రి, కూతుళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా అనిపిస్తాయి.
టెక్నికల్ గా సినిమా విలువలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ బావుంది. దర్శకుడిగా శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ సినిమాతో ఫిదా చేసేశాడు.
రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu