‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌ను ప్రశంసించిన కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ కన్నడ నటుడు యశ్‌ను ప్రశంసించారు. ఆయన హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై విజయం సాధించింది. చిత్రాన్ని కన్నడతోపాటు తెలుగు, తమిళం‌, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.250 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అంతేకాదు ఈ చిత్రం విమర్శకులు, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

కాగా ‘కేజీఎఫ్‌’ను తాజాగా చూసిన కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నారు. ఇది చక్కటి సినిమా అని కితాబిచ్చారు. ‘నేను కాస్త ఆలస్యంగానే మాట్లాడుతుండొచ్చు.. ఎట్టకేలకూ ‘కేజీఎఫ్‌’ చూశా. ఇది అద్భుతమైన చిత్రం. సాంకేతికత పరంగా బ్రిలియంట్‌గా తీశారు. కథను ఉత్కంఠంగా చూపించారు. మరోపక్క కూల్‌గానూ అనిపించింది. ప్రశాంత్‌ నీల్‌ సూపర్‌గా దర్శకత్వం వహించారు. స్క్రీన్‌ప్లే చక్కగా ఉంది. నేపథ్య సంగీతం అత్యద్భుతంగా ఉంది. రాక్‌స్టార్‌ యశ్‌ తెరపై కనిపించిన విధానం నాకెంతో నచ్చింది’ అని ఆయన పోస్ట్‌ చేశారు.