ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ఏపీ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకరించారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల కోడ్‌ సమీపిస్తున్నందున వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కేబినెట్‌ కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో మధ్యంతర భృతిపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై అశితోష్‌ మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగులకు ఎంతమేర ఐఆర్‌ ఇవ్వాలనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. 40 నుంచి 45 శాతం వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. సుదీర్ఘ చర్చల అనంతరం… 20 శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఇదే అంశాన్ని కేబినెట్‌లో చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు.