అవును..కిమ్‌ నా ప్రేయసి

టాలీవుడ్‌‌తోపాటు బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు హర్షవర్ధన్‌ రానే. ‘నా ఇష్టం’, ‘అవును’, ‘అనామిక’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘ఫిదా’, ‘కవచం’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షవర్ధన్‌. కాగా ఆయన నటి కిమ్‌ శర్మతో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరు అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ’ అంటూ హర్షవర్ధన్‌ను విష్‌ చేసి ఇటీవల కిమ్‌ తన బంధం గురించి పరోక్షంగా చెప్పారు. అయితే ఇది నిజమేనని తాజాగా హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు.

‘నేను చాలా సూటిగా మాట్లాడతా. దాచడానికి ఏమీ లేదు. ఓ విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి అనుకునే వ్యక్తిని కాదు. నేను ప్రేమలో ఉన్నా.. కానీ అది నా వ్యక్తిగత జీవితం. ఈ విషయంలో ఆమె (కిమ్‌) ఇబ్బందిగా ఫీల్‌ అవుతోంది. ఆమె అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను’ అని ఆయన చెప్పారు.

అనంతరం కిమ్‌ తన ప్రేయసని చెబుతూ.. ‘ఆమె కాదు అని ఖండించలేను. ఎక్కడ చూసినా మా జంట కనిపిస్తోంది కదా. ఇప్పటి వరకూ మేం ఏ విషయాన్ని దాచలేదు. ఇది వృత్తికి సంబంధించినది కాదు.. కాబట్టి నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు’ అని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. కిమ్‌ ‘ఖడ్గం’, ‘ఆంజనేయులు’, ‘మగధీర’ తదితర సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడారు. ఆమె వ్యాపారవేత్త అలీ పంజానీని 2010లో వివాహం చేసుకున్నారు. 2016లో వీరు విడాకులు తీసుకున్నారు.