రామ్‌ ‘హలో గురు ప్రేమ కోసమే’ ట్రైలర్‌

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటిస్తున్న సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ సినిమాకి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రణీత మరో కథానాయికగా కన్పించబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. పోసాని కృష్ణమురళి ఎవరినో తిడుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ‘స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా జాయిన్‌ అయిన తొలిరోజు అందరూ చేసే మొదటి పని ఏంటో తెలుసా? అమ్మాయిల్లో ఎవరు బాగున్నారని అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారని అమ్మాయిలు ఏరుకోవడం’ అని రామ్‌ చెప్పిన డైలాగ్‌ ఫన్నీగా ఉంది.

ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌..రామ్‌కు స్నేహితుడి పాత్రలో నటించారు. రామ్‌ ల్యాప్‌టాప్‌లో ఏదో పనిచేసుకుంటూ ఉంటే.. ప్రకాశ్‌రాజ్‌ పక్కకు వచ్చి ‘ఏం చేస్తున్నావ్‌ అక్కడా..?’ అని అడుగుతాడు. ఇందుకు రామ్‌ ‘సైట్‌ కొడుతున్నా ఫ్రెండూ’ అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. అనుపమ, రామ్‌ ఓ కాఫీ షాప్‌లో కూర్చున్నప్పుడు అనుపమ..’పెళ్లి అయిన తర్వాత అమ్మాయి జీవితం అమ్మ అవడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి జీవితం నాన్న ఉండడం వల్ల బాగుంటుంది’ అంటుంది. ఇందుకు రామ్‌..’ఈ సోదంతా చెబితే వినడానికి బాగుంటుంది’ అని వేసిన పంచ్‌, ‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలీదు కానీ అబద్ధాలు చెబితే అమ్మాయిలు మాత్రం కచ్చితంగా పడతారు’ అని చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచాయి.

‘గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అని చదివే చుదువును మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం’ అని రామ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. శిరీష్‌, లక్ష్మణ్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.