కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో ప్రస్తుతం కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆంధ్రాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం వైసీపీలో పెద్ద దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇంతకీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, కాకాణి గోవర్ధన్ రెడ్డికి మళ్లీ గెలిచే సత్తా ఉందా ?, అసలు కాకాణి గోవర్ధన్ రెడ్డి నేపథ్యం ఏమిటి ? చూద్దాం రండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో సంపన్న రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కాకాణి కర్ణాటకలోని జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, తమిళ నాడు లోని పెరియార్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
కాకాణి క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరు కేంద్రంగా పలు వ్యాపారాలు చేసేవారు. నిర్మాణ రంగం మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారా తన ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేసుకున్నారు. ఐతే, కాకాణి కుటుంబానిది తొలి నుంచి రాజకీయ కుటుంబమే. తండ్రి వెంకటరమణారెడ్డి తోడేరు గ్రామ సర్పంచ్ గా, పొదలకూరు తాలూకా అధ్యక్షుడిగా సుధీర్ఘ కాలం పనిచేశారు. కాకాణి తల్లి గారు సైతం తోడేరు గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. కాకాణి కూడా తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో 2006 జిల్లా పరిషత్ ఎన్నికల్లో సైదాపురం జెడ్పీటీసీ గా ఏకగ్రీవంగా ఎన్నికై నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.
వైఎస్ మరణం తర్వాత జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని నెల్లూరు జిల్లాలో జగన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఎదిగారు. 2014, 2019 లలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాకాణి 2022 లో మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మరియు మార్కెటింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాకాణి తండ్రి వెంకటరమణారెడ్డికి ఎమ్మెల్యే గా విజయం సాధించాలని కోరిక ఉండేది. అందు కోసం ఏకంగా 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర కాలంలో అనేక మార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కానీ, నేడు ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తండ్రి కలను సాకారం చేశారు.
కాకాణికి నీటిపారుదల , వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి అంశాల మీద మంచి పట్టుంది. కానీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అవినీతి ఆరోపణల నేపథ్యం అంటూ వస్తే.. అందరికంటే ముందుగా ప్రతిపక్షాలకు గుర్తొచ్చే పేరు కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా అవినీతి చరిత్రలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి అంత పెద్ద హిస్టరీ ఉంది. దీనికితోడు ఇప్పటికే పలు వివాదాస్పద వ్యవహారాలలో ఇరుక్కున్నారు. మరి రాజకీయ నాయకుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లోకాకాణి గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. కాకాణి గోవర్ధన్ రెడ్డికి మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ లేదు. ప్రజల్లో కాకాణి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాగైనా కాకాణిని తప్పించాలని అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి.. కాకాణి మళ్లీ గెలవడం దాదాపు అసాధ్యమే.