చిల్లర రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: పవన్‌ కళ్యాణ్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప అభివృద్ధి పనులను ఆటంకపరచడం సరికాదని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే క్రమంలో ప్రజలు నష్టపోరాదని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి నిర్మాణం నిలిపివేయడంతో దాదాపు 20వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో రెండు నెలలుగా పనులు లేక లక్షలాది మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును నిలిపివేయడంలో ఏదో లోతైన విషయం ఉందన్న పవన్‌..చిల్లర రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరిన వారే ప్రస్తుతం తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల గురించి ఇంకా ఆలోచించలేదని.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించామన్నారు.

అతి క్లిష్టమైన తెలంగాణ, కాశ్మీర్‌ సమస్యలకే పరిష్కారం దొరికినప్పుడు కాపు రిజర్వేషన్‌ సమస్య అంతకంటే పెద్దదేమీ కాదని పవన్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల దృష్టితో కాకుండా సమస్యను పరిష్కరించాలనే కోణంలో చూడాలని సూచించారు. కాపులను ఓసీలు, బీసీలు కాదన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం ఆయన భీమవరం మండలం తాడేరులో అనారోగ్యంతో మృతి చెందిన జనసేన అభిమాని కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్యకి రూ.2.50 లక్షల చెక్కును అందజేశారు. వారిని ఓదార్చే క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్షలలో ఆయన పాల్గొన్నారు. అమరావతిలో కరకట్టపై ఆక్రమణల తొలగింపు అంశంలో రాజకీయ కక్ష సాధింపు, పక్షపాత విధానాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం తగవని పవన్‌ కళ్యాణ్‌ హితవు పలికారు.