‘మహేష్‌ సినిమాలు నేను చూడను .. ఆయనతో పెళ్లి కోసం కెరీర్‌ను వదిలేశా : నమ్రత

ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి నటిగా రాణించారు నమ్రత. హిందీలో పలువురు స్టార్‌ హీరోలతోనూ కలిసి నటించిన ఆమె.. మంచి అవకాశాలు వస్తున్న సమయంలో.. మహేష్‌బాబును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి నమ్రత దాదాపు ఐదేళ్లు ఎదురుచూశారు. వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. కాగా వైవాహిక జీవితం చాలా ప్రశాంతంగా ఉందని నమ్రత ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తను మహేష్‌ కెరీర్‌పైన దృష్టి పెట్టడం సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు.

మహేష్‌ సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. ‘మహేష్‌ సినిమాలు నేను చూడను (నవ్వుతూ). అది నన్ను చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సామాన్య ప్రజలు లాగే కుటుంబ సభ్యులు కూడా ఆయన సినిమా ప్రివ్యూలకు వెళ్లి, ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ, నేను ఇంట్లో కూర్చుని గోళ్లు కొరుకుతూ, దేవుడ్ని ప్రార్థిస్తుంటా. ఇది గత సినిమా కంటే బాగుంటుందా.. ఇలా ఆలోచిస్తూ ఉంటా. నిజంగా ఇది చాలా వేదనకు గురి చేస్తుంది. సంతోషంగా ఉండు, ఎక్కువ ఆలోచించొద్దు అని మహేష్‌ చెబుతుంటాడు.. కానీ అది సాధ్యమయ్యే పని కాదు (నవ్వుతూ)’ అని ఆమె చెప్పారు.

నమ్రత తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ నా కెరీర్‌ గురించి బాధపడలేదు. నాకు పాత్రలు కావాలని ఏ దర్శకుడ్ని అడగలేదు. నేను చాలా పెద్ద సినిమాల్లో నటించా. సంజయ్‌ దత్‌తో ‘వాస్తవ్‌’, అనిల్‌ కపూర్‌తో ‘పుకార్’, సల్మాన్‌ ఖాన్‌తో ‘జబ్‌ ప్యార్‌ కిసీ సే హోతా హై’ సినిమాల్లో నటించా. ఈ సినిమాల విజయంతో ఇంకా డబ్బులు సంపాదించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు తెలిసి నా భర్త కెరీర్‌పై నేను చూపిన ఆసక్తిని.. నా కెరీర్‌పై చూపలేదు. స్టార్‌ హీరోయిన్‌గా నంబరు 1 స్థానంలో ఉండాలనే కోరిక నాకెప్పుడూ లేదు. మహేష్‌ను పెళ్లి చేసుకోవడానికి నా కెరీర్‌ను సంతోషంగా వదిలేశా. అదృష్టవశాత్తూ.. నా 14 ఏళ్ల వైవాహిక జీవితంలో విచారానికి, బాధకు గురైన ఒక్క సందర్భం కూడా లేదు. ఇన్నేళ్లు నేను, మహేష్‌ ఎంతో సంతోషంగా ఉన్నామంటే ప్రజలు నమ్మరు’ అని అన్నారు.

పిల్లల గురించి చెబుతూ.. ‘పిల్లలు గౌతమ్‌, సితార కూడా నటనను కెరీర్‌గా ఎంచుకోవాలని మేం చెప్పం. ఇది చాలా ఒత్తిడితో కూడిన వృత్తి. ఒకవేళ వారికి నిజంగా నటపై ఆసక్తి ఉంటే.. దాన్ని స్వాగతిస్తాం. నాకు తల్లిగా నా బాధ్యతలు ముందు.. తర్వాతే ఏదైనా’ అని ఆమె చెప్పారు.

అనంతరం మహేష్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన నిర్ణయాలు మీ ప్రమేయంతోనే జరుగుతాయట అని ప్రశ్నించగా నమ్రత నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘చూడటానికి అలానే అనిపిస్తుంది. ఆయన ముఖ్యమైన విషయాల గురించి నాతో చర్చిస్తారు. కానీ మహేష్‌ స్వతంత్ర భావాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి. ఆయన నా అభిప్రాయాల్ని గౌరవిస్తారు. దానర్థం కళ్లు మూసుకుని నా నిర్ణయాల్ని అనుసరిస్తారని కాదు’ అని ఆమె తెలిపారు. ఇటీవల మహేష్‌ ఓ ఇంటర్వ్యూలో నమ్రత గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘నమ్రత నా బలం, నా జీవితం.. నేను ఈ స్థాయికి రావడానికి ఆమే కారణం’ అని అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates