ప్రభాస్‌ అంటే క్రష్‌ ఉండేది: దర్శకురాలు

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌పై తనకు క్రష్‌ ఉండేదని అంటున్నారు ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె తెరకెక్కించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పారు. ప్రభాస్‌పై తనకు ఎప్పుడూ క్రష్‌ ఉండేదని.. కానీ ఈ మాటను ప్రభాస్‌కు చెప్పలేకపోయానని అన్నారు. ప్రభాస్‌ ఎదురుగా ఉంటే నోట మాట కూడా రాదని పేర్కొన్నారు. ప్రభాస్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు.

‘ఓ బేబీ’ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించారు. నాగశౌర్య, రావు రమేష్‌, మాస్టర్‌ తేజ, రాజేంద్రప్రసాద్, లక్ష్మి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. జులై 5న ‘ఓ బేబీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.