నాకోసం ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి: సోనాక్షి సిన్హా

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా .. పెళ్లి చేసుకుని త్వరగా సెటిల్‌ అవ్వాలనుకుంటున్నానని అంటున్నారు. ఈ విషయాన్ని ‘సూపర్‌ డ్యాన్సర్‌ 3’ అనే కార్యక్రమంలో ఆమె వెల్లడించారు. ‘కళంక్‌’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సోనాక్షి, ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌ ఈ డ్యాన్స్‌ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. జహీర్‌ ఇక్బాల్‌ అనే నటుడితో సోనాక్షి డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. త్వరలో పెళ్లి చేసుకునే యోచనలోనూ ఉన్నారట. ‘సూపర్‌ డ్యాన్సర్‌ 3’కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టి.. సోనాక్షిని ఈ విషయం గురించి అడిగారు. ఇందుకు సోనాక్షి స్పందిస్తూ.. ‘అదేం లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా’ అన్నారు. ‘మీ ముగ్గురిలో ముందు ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు’ అని శిల్ప అడిగిన ప్రశ్నకు.. ‘నేనే’ అని సోనాక్షి సమాధానం ఇవ్వడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఎందుకు అని అడగ్గా.. ‘నేను ఆలియా, వరుణ్‌ల కంటే ముందే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకోసం ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి. సరైన వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను’ అని వెల్లడించారు సోనాక్షి.