HomeTelugu Big Storiesరియల్ హీరోలా పోరాడిన ఐపీఎస్ అధికారి

రియల్ హీరోలా పోరాడిన ఐపీఎస్ అధికారి

కేరళలో ఓ కేంద్ర మంత్రికి పోలీసు ఉన్నతాధికారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. చివరికి కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగినా.. తనకు విధి నిర్వహణే ముఖ్యమంటూ మాటకు మాట సమాధానం చెప్పి ఆ ఐపీఎస్‌ అధికారి ఆయన్ని అడ్డుకున్న తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలకు వేదికగా మారిన కేరళలోని శబరిమల ఆలయ ప్రాంతంలో చోటుచేసుకుంది.

4 22

కేంద్ర సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ బీజేపీ కార్యకర్తలతో కలిసి శబరిమల ఆలయ దర్శనానికి నీలక్కల్‌ బేస్‌ క్యాంప్‌ వద్దకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో ప్రైవేట్‌ వాహనాలతో ఆయన అక్కడికి రాగా.. 35 ఏళ్ల ఐపీఎస్‌ అధికారి యతీశ్‌ చంద్ర కేంద్రమంత్రిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఈ మధ్య చాలా వరదలు వచ్చాయి అందుకే వాహనాలు నిలిపేస్తున్నామని ఐపీఎస్ అధికారి చెప్పగా.. కేంద్రమంత్రి కోపంగా నాకు తెలుసు.. ప్రభుత్వ బస్సులను అనుమతిస్తున్నప్పుడు.. ప్రైవేట్‌ వాహనాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ మండిపడ్డారు. దయచేసి నా మాట వినండి… ఇటీవల ఇక్కడ వరదల కారణంగా ఆలయ సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. అక్కడ కొండ చరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది. అందుకే వాహనాలను రానివ్వడం లేదని ఐపీఎస్ అధికారి తెలిపారు. అయితే ఏం
జరిగినా.. మీరు బాధ్యత వహిస్తానంటే అప్పుడు మీ వాహనాలను పంపిస్తానని ఐపీఎస్ అధికారి చంద్ర చెప్పగా.. నేను బాధ్యత వహించనని మంత్రి అన్నారు. ఇక్కడి పరిస్థితి ఇది. ఎవరూ బాధ్యత వహించడానికి ముందుకు రారు అని అధికారి అన్నారు.

వెంటనే మరో బీజేపీ నేత కలగజేసుకుని.. ఓ కేంద్రమంత్రితో మాట్లాడే తీరు ఇదేనా? అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది. అనంతరం కేంద్రమంత్రి సూచనతో మద్దతుదారులు వెనక్కితగ్గడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఈ ఘటనపై త్రిస్పూర్‌ జిల్లా ఎస్పీ అయిన యతీశ్‌ చంద్ర మాట్లాడుతూ.. మా విధులు నిర్వర్తించేందుకే మేం ఇక్కడ ఉన్నాం. శబరిమలలో ప్రశాంతత నెలకొల్పడం.. భక్తులకు భద్రత కల్పించడమే మా ప్రథమ ప్రాధాన్యం. మాకు ఎలాంటి అజెండా ఉండదు అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసన చేపట్టేందుకు వచ్చిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రన్‌, హిందూ ఐక్య వేదిక చీఫ్‌ కేపీ శశికళను ఇదే అధికారి అరెస్టు చేశారు. కేంద్రమంత్రితో ఈ ఐపీఎస్‌ అధికారి ప్రవర్తించిన తీరు బాలీవుడ్‌ సినిమా “దబాంగ్” సినిమాలో పోలీసు అధికారి సల్మాన్‌ఖాన్‌లా ఉందని పలువురు
మెచ్చుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!