పుకార్లపై ‘జై లవకుశ’ టీమ్ క్లారిటీ!

ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత రెండు, మూడు రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఒకింత నిరాశ కలిగింది. తన అభిమాన నటుడు సినిమా దసరా కానుకగా వస్తుందనుకుంటే.. వాయిదా పడడమేంటని నిరాశ పడ్డారు. అయితే ఈ వార్తలపై చిత్రబృందం తాజాగా స్పందించింది. 
అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని విడుదలలో ఎలాంటి ఆలస్యం లేదని, ముందు అనౌన్స్ చేసినట్లుగానే సెప్టెంబర్ 21న విడుదల చేయడం ఖాయమని వెల్లడించారు. అలానే ఎన్టీఆర్ నటిస్తోన్న మూడు పాత్రల్లో ఒకటైన లవ పాత్రకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే విడుదల చేసిన ‘జై’ పాత్రకు సంబంధించిన టీజర్, పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ ప్రచార చిత్రాలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అనుకున్న తేదీకు ప్రేక్షకుల ముందుకు రావడానికి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది.