బీజేపీతో జత కట్టిన జనసేన


రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో బీజేపీ నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. బీజేపీతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

”ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం.. అంతకుముందు అవకతవకలు, అవినీతితో కూడిన పరిపాలన. ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. దాన్నే బీజేపీ-జనసేన అందించబోతున్నాయి. ఈ కలయిక అండగా నిలబడిన ప్రధాని మోడీ, అమిత్‌షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. ఏపీలోనే కాకుండా అవసరమున్న ప్రతిచోటా మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా పనిచేయాలని వారికి హామీ ఇచ్చారు. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసే వెళ్తాం” అని పవన్‌ ఆయన వివరించారు.

”గతంలో రాజకీయంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇప్పుడు ఏకపక్షంగా తరలిస్తారని అనుకోను. కులతత్వం, కుటుంబపాలనతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తాం. అంతపెద్ద రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పా. 33వేల ఎకరాలు ఎందుకని అడిగా. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయి.. రైతులు రోడ్డున పడ్డారు. రాజధానిని తరలిస్తే రోడ్లపైకి రావడమే కాదు.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. అమరావతిని తరలిస్తే చూస్తూ కూర్చోము.. తెగించే నాయకత్వం ఉంది” అన్నారు.

”రాష్ట్రానికి మూడు రాజధానులు అనడం ప్రజలను మభ్యపెట్టడమే. హైకోర్టు పెడితే దాన్ని రాజధాని అనరు. హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బాధ్యత వహించాలి. అప్పట్లో వాళ్లు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకపోతే బాగుండేది. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి 22 మంది ఎంపీలున్న వైసీపీనే అడగాలి” అని పవన్‌ వ్యాఖ్యానించారు.

”అఖండ భారతంగా ఉన్న మనదేశం నుంచి పాకిస్థాన్‌ విడిపోయింది. పాక్‌ ఇస్లాం దేశంగా చెప్పుకుంటున్నా.. మన దేశాన్ని హిందూ దేశంగా చెప్పలేదు. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల్లో వెనుకబడిన వర్గాలు, దళితులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారు ఇబ్బందులు పడకుండా ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడి ముస్లింలకు పౌరసత్వం రద్దు చేస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం.. మన దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ లేదు” అని చెప్పారు.

ఏపీ రాజకీయాల్లో ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో రెండు పార్టీల కలయిక శుభ పరిణామంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జనసేనతో తప్ప ఏ ఇతర పార్టీలతోనూ బీజేపీకు రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నాలుగున్నరేళ్లపాటు ప్రజా సమస్యలపై పోటీ చేసి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామన్నారు. బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినందుకు పవన్‌కు జీవీఎల్‌ అభినందలు చెప్పారు. ఏపీలో అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టించగలమని..అభివృద్ధినే ఆధారంగా చేసుకుని ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

CLICK HERE!! For the aha Latest Updates