తెలంగాణలో పొత్తులపై జనసేన చర్చలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులు, వ్యూహాలపై పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. జిల్లాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలను, మనోభావాలను తెలుసుకునే పనిలో పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన, సీపీఎం కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై జనసేనలో చర్చల ప్రక్రియ జోరందుకుంది. ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశమయ్యారు. జనసేనతో జట్టు కట్టేందుకు సీపీఎం తెలంగాణ కమిటీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని బృందంతో జరిపిన చర్చల సారాన్ని పవన్‌కు కమిటీ సభ్యులు వివరించారు. ఆ చర్చలు సామరస్యంగా, ఫలప్రదంగా జరిగాయని ఈ మేరకు మరోసారి సమావేశమవ్వాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ దఫా చర్చల్లో పాల్గొనాల్సిందిగా పవన్‌ను కోరాగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో టీడీపీ జట్టుకట్టనుందనే వార్తలు వస్తున్నందున ఆ అంశంపైనా చర్చించారు. తెలంగాణలో పార్టీకి ఉన్న బలం, ఏయే స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ సభ్యులతో పవన్‌ చర్చించారు. తమ పార్టీకి సంబంధించిన పొత్తులపైనా చర్చించారు.

రెండు రోజుల్లో సీపీఎం ప్రతినిధి బృందంతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యే అవకాశం ఉందని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు జనసేనను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయానికి ప్రతి రోజూ పది మంది దాకా వస్తున్నారట. పార్టీ కార్యాలయానికి వస్తున్నవారిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో వస్తున్నారని, అయితే.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వాళ్లను మాత్రమే జనసేనలో చేర్చుకుంటామని వారికి చెబుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని చెప్పారు. వాళ్ల దరఖాస్తులను పరిశీలించి.. పార్టీ అధ్యక్షుడిని సంప్రదించాక నిర్ణయం తీసుకుంటామన్నారు.