మహేశ్‌ హీరోయిన్‌.. మరో స్పెషల్‌ సాంగ్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ‘నం.1: నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఆమె బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘స్త్రీ’ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ఆమె ఇప్పుడు ‘కళంక్‌’ సినిమాలోని పాటలో సందడి చేశారు. హీరోలు వరుణ్‌ ధావన్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. ఈ పాట వీడియోను చిత్ర బృందం శనివారం రాత్రి విడుదల చేసింది. ‘ఐరా గైరా..’ అని సాగే ఈ గీతం శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. పాట జోష్‌ఫుల్‌గా ఉందని యూట్యూబ్‌లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ప్రీతమ్‌ సంగీతం అందించారు. అమితాబ్‌ భట్టాచార్య పాటకు సాహిత్యం సమకూర్చారు. ఈ పాట విడుదలైన 15 గంటల్లోనే దాదాపు 40 లక్షల వ్యూస్‌ సంపాదించుకుంది.

‘కళంక’ సినిమాలో ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా, మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.