బాలీవుడ్ నటి కంగనా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ నోటీసులు జారీచేసింది. సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని డిసెంబర్ 6న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా నేతృత్వంలోని అసెంబ్లీ ప్యానల్ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా పేర్కొంటూ సోషల్ మీడియాలో నటి కంగనా రనౌత్ పోస్టు చేశారని రైతు సంఘం నేతలు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై ముంబైలో కంగనా రనౌత్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా రైతు సంఘాలు ఉద్యమం చేస్తున్నసంగతి తెలిసిందే. సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమంపై మొదటి నుంచీ కంగనా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

రైతుల దీర్ఘకాలిక ఉద్యమంతో చలించిన ప్రధాని మోదీ నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై కంగనా రనౌత్ అసంతృప్తి వెళ్లగక్కింది. ఇది సిగ్గుచేటు, అన్యాయం అంటూ పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలోని ప్రజలు చట్టాలు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates