కౌశల్ ఆర్మీ పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టిన కౌశల్‌ తర్వాత తర్వాత తన పొటెన్షియాలిటీ చూపిస్తూ ఎలాంటి సందర్భంలో అయినా ఒకే విధంగా ఉంటూ తన సత్తా చాటాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న, కనిపిస్తున్న పేరు.. కౌశల్ ఆర్మీ. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కౌశల్‌కు సపోర్ట్‌గా ఏర్పడిన ఈ గ్రూప్.. ఆయన ఈ షో నుంచి ఎలిమినేట్ కాకుండా వారే భారీగా ఓట్లు వేస్తున్నారని, కౌశల్‌‌ను వ్యతిరేకించే సభ్యులను దుర్భషలాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా స్పందించాడు. ఓ ఆన్‌లైన్ మీడియా చానెల్‌తో కత్తి మాట్లాడుతూ.. ‘అభిమానం ఉండొచ్చు కానీ, దురాభిమానం ఉండకూడదు. బి‌గ్‌బాస్‌‌కు వచ్చిన తర్వాత ఇంట్లోవారిలా మెలిగాల్సి ఉంటుంది. హౌస్‌మేట్స్‌లో కొందరు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. అయితే, నచ్చనవారిపై విమర్శలు చేస్తూ ఉన్మాద స్థాయికి చేరుకోవడం మంచిది కాదు. కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం, బెదిరింపులు చేయడం మంచిది కాదు. కౌశల్‌కే కాకుండా, మిగతా వాళ్లకు కుటుంబాలు ఉంటాయి. అలాంటి ట్రోలింగ్‌లు వారిని బాధిస్తాయి’ అని తెలిపారు.

‘కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోంది. వీరు ఎవరికి సైన్యం? ఎవరి కోసం సైన్యం? అనేది అర్థం కావడం లేదు. ఏవరీ కౌశల్. బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండచ్చు. నాకు నచ్చలేదు. అలాగని ట్రోల్ చేస్తారా? ఇటీవల ఆయన పేరు మీద టూకే రన్ కూడా చేశారు. కేరళ వరదలు కోసం అలాంటివి చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అందేవి’ అని కత్తి మహేష్ అన్నారు. ఈమధ్యనే పవన్ ఫ్యాన్స్ ఉన్మాదులు అన్న కత్తి మహేష్ కొత్తగా ఇప్పుడు కౌశల్ ఆర్మీ మీద పడ్డాడు. కౌశల్ ఆర్మీవి ఉన్మాదపు చర్యలంటూ కత్తి వ్యాఖ్యానించాడు. బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌లో కత్తి మహేష్ కూడా హౌస్‌మేట్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన నటుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలకు దిగి వార్తల్లో నిలిచారు. ఇటీవల రాముడిపై అనుచిత వ్యాఖ్యలతో నగర బహిష్కరణ కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ఛానెల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. మరి కౌశల్ ఆర్మీలో పవర్ స్టార్ ఫ్యాన్స్ శాతమెంతో తెలియదు కాని కౌశల్ ఆర్మీ మాత్రం అంతటా సంచలనంగా మారుతుంది