మోడీతో డిన్నర్‌ చేయాలనుంది అంటున్న కత్రినా

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి డిన్నర్‌ చేయాలని ఉందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా మీడియాతో పంచుకున్నారు. కత్రినా ప్రస్తుతం ‘భారత్‌’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడారు. ‘మీకు ఎవరితో కలిసి డిన్నర్‌ చేయాలని ఉంది.. ముగ్గురి పేర్లు చెప్పండి?’ అని ప్రశ్నించగా.. ‘మార్లిన్ మన్రో, నరేంద్ర మోడీ జీ, కండోలిజా రైస్’ అని చెప్పారు.

వెంటనే అక్కడే ఉన్న బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కల్పించుకుంటూ.. ‘ఇందులో సల్మాన్‌ ఖాన్‌ ఎక్కడున్నాడు?’ అని ప్రశ్నించారు. దీనికి కత్రినా బదులిస్తూ.. ‘ఇక్కడ ఇప్పటి వరకు నేను కలిసి డిన్నర్‌ చేయని వారి గురించి మాట్లాడుతున్నాం. నిజానికి నేను ఎప్పుడూ సల్మాన్‌తో కలిసి డిన్నర్‌ చేయలేదు. ఎందుకంటే అతడు డిన్నర్‌ బయట చేయడు’ అని అన్నారు. దీనికి సల్మాన్‌ స్పందిస్తూ.. ‘ఆమె (కత్రినా) సాయంత్రం 6.30 గంటలకు డిన్నర్‌ చేస్తుంది. అప్పుడు నేను లంచ్ చేస్తాను’ అని ఫన్నీగా చెప్పారు.

అనంతరం మీడియా ఇదే ప్రశ్న సల్లూభాయ్‌ను అడిగింది. ‘నా డిన్నర్‌లో నేను మాత్రం ఉంటే చాలు.. సీరియస్‌గా చెబుతున్నా. నేను నా లంచ్‌, డిన్నర్‌ ఇంట్లో కుటుంబంతో కలిసి చేస్తా’ అని పేర్కొన్నారు. ‘భారత్’ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. దిశా పటానీ ఇందులో మరో హీరోయిన్‌. జూన్‌ 5న సినిమా విడుదల కాబోతోంది.