చంద్రబాబు ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం!!


‘ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు డిపాజిట్‌ కూడా రాదని, వైసీపీ గెలుపు ఖాయమని.. బాబు ఖేల్ ఖతం’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ వికారాబాద్‌లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మంచివాళ్లని.. వారితో తమకు ఎలాంటి పంచాయితీ లేదని అన్నారు. చంద్రబాబు వంటి వాళ్లతోనే తమకు గొడవలని అన్నారు. చంద్రబాబు ఖేల్ ఖతం అయిందని.. చిత్తుగా ఓడిపోబోతున్నారని అన్నారు. చంద్రబాబులా చీకటి పనులు, కుట్రలు తాము చేయలేమని కేసీఆర్‌ అన్నారు.

‘చంద్రబాబు నన్ను రోజూ తిడుతున్నారు. హైదరాబాద్‌పై శాపనార్థాలు పెడుతున్నారు. ఆయన పరిస్థితి బాగాలేదు. డిపాజిట్లు కూడా రావు అని కేసీఆర్ అన్నారు. తన దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉందని కేసీఆర్‌ చెప్పారు. ‘ప్రత్యేక హోదాకు మద్దతిస్తామంటే.. చెవిలో చెప్పారా అని అంటున్నారు. మళ్లీ చెబుతున్నా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదే మాటపై ఉన్నాం. తెలంగాణ ఎంపీలు 17 మందికి వైసీపీ ఎంపీలు కలిస్తే మొత్తం 35 మంది.. హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడుతాం’ అని స్పస్టం చేశారు. పోలవరానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్న కేసీఆర్‌.. రాజకీయాల కోసం చంద్రబాబులా అబద్ధాలు చెప్పబోమన్నారు.