దేవరకొండకు అభిమానిగా మారిపోయా: కైరా

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ లో ‘వసుమతి’గా మెప్పించి.. ‘వినయ విధేయ రామ’లో ‘సీత’గా ఆకట్టుకునేందుకు సిద్ధమౌతున్నారు హీరోయిన్‌గా కైరా అద్వాణీ. రామ్‌చరణ్‌ హీరోయిన్‌గా నటించిన సినిమా ఇది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. వివేక్‌ ఒబెరాయ్‌, ఆర్యన్‌ రాజేష్‌, స్నేహ, మధుమిత, రవివర్మ, హిమజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా కైరా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తన కొత్త సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘వినయ విధేయ రామ’ లో సీత గా కనిపిస్తా. ‘భరత్‌ అనే నేను’ సినిమాలో నా పాత్రకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ఇందులో చేసే అవకాశం వచ్చింది. నేను భరతనాట్యం నేర్చుకున్నా. కాబట్టి డ్యాన్స్‌ సులభంగా అనిపించింది. చరణ్‌ కూడా సహాయం చేశారు. ఇందులో భారీ తారాగణం ఉంది. వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. బోయపాటి శ్రీను కుటుంబ కథా చిత్రంగా దీన్ని తీశారు. ఇందులో చరణ్‌ నటన బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మంచి సంగీతం అందించారు. ‘రామసీత’ పాట నాకు చాలా నచ్చింది .

‘భరత్‌ అనే నేను’ షూట్‌ సమయంలో నమ్రత, మహేశ్‌ బాబు, సితార తదితరులు స్నేహితులయ్యారు. ఈ సినిమా సమయంలోనూ చరణ్‌, ఉపాసన, బోయపాటితో స్నేహం ఏర్పడింది. వారు ఒక్కోసారి నా కోసం సెట్‌కు ఇంటి భోజనం పంపేవారు. ఓ కుటుంబంతో కలిసి ఉన్న భావన కల్గింది’.

‘వినయ విధేయ రామ’ తర్వాత పంజాబీ సినిమాలో నటిస్తున్నా. ఇందులో యాక్షన్‌ ఉంటుంది. దాని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. ‘ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమాలో ‘సాక్షి’ పాత్రకు మంచి పేరు వచ్చింది. బయట కనిపిస్తే సాక్షి అని పిలిచేవారు. ఆ తర్వాత భరత్‌ అనే నేను వచ్చాక వసుమతి అంటున్నారు. కరణ్‌ జోహార్‌ సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన ‘లస్ట్‌ స్టోరీస్’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఇందులో నా పాత్రకు మంచి పేరు వచ్చింది. నాకు అన్ని రకాల కథల్లో, భాషల్లో నటించాలని ఉంది. ఎక్కడి నుంచి మంచి పాత్ర వస్తే అక్కడ చేస్తా. నా తొలి ప్రాధాన్యత పాత్రకే’.

‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చూశాక హీరో విజయ్‌ దేవరకొండకు అభిమానిగా మారిపోయా. ఈ చిత్రం రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ లో నటిస్తున్నా. దీనికి, మాతృకకు చాలా తేడా ఉంటుంది, పోలికలే ఉండవు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా నాకు కథ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. ఢిల్లీ నేపథ్యంలో సాగే కథ ఇది’.