మహేశ్‌, నమ్రతలు పెళ్లిరోజు.. 650 దివ్యాంగ బాలలకు విందు


స్టార్‌ హీరో మహేశ్‌బాబు, నమ్రత దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా 650 మంది దివ్యాంగ చిన్నారులకు భోజనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న దేవనార్‌ స్కూలులోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడంలో నిబద్ధతగా వ్యవహరించిన మహేశ్‌ బృందానికి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రత్యేక రోజున తమ దంపతులను ఆశీర్వదించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పెళ్లిరోజు సందర్భంగా మహేశ్‌ సోషల్‌మీడియా వేదికగా నమ్రతను విష్‌ చేశారు. ఆమెతో కలిసి దిగిన చక్కటి ఫొటోను షేర్‌ చేశారు. దీనికి నమ్రత ప్రతిస్పందిస్తూ.. ‘నా జీవితంలో ఎంతో అద్భుతమైన 14 ఏళ్లను ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెళ్లిరోజు శుభాకాంక్షలు మహేశ్‌’ అని పోస్ట్‌ చేశారు. ఈ దంపతులకు సినీ ప్రముఖులు ట్వింకిల్‌ ఖన్నా, శ్రుతిహాసన్, దేవిశ్రీ ప్రసాద్‌‌ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు.