సితారకు డిస్నీ బంపర్ ఆఫర్

డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్‌ మూవీ ఫ్రాజెన్‌-2 తెలుగులోకి డబ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకుముందే యువతలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ మూవీ సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌ హీరో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుమార్తె ఘట్టమనేని సితార తన గొంతును దానం చేస్తోంది. ప్రతిష్టాత్మక డిస్నీలాంటి నిర్మాణ సంస్థ చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఇప్పటికే తన ఆటపాటలతో ఆకట్టుకుంటూ మహేష్‌బాబు అభిమానులను మురిపిస్తున్న బేబీ సితార తన సరికొత్త టాలెంట్‌తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు ప్రముఖ నటి నిత్యామీనాన్‌ డబ్బింగ్‌ చెప్తున్నారు. దీంతో హలీవుడ్‌లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫ్రోజెన్ 2 విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను క్రియేట్ చేస్తోంది.

కాగా 2013లో విడుదలైన హాలీవుడ్‌ మూవీ ‘ఫ్రొజెన్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్‌’. ఈ సిరీస్‌లోనే మూవీ ఫ్రాజెన్‌ -2 రూపుదిద్దుకుంది. ఈ మూవీ మొదటి పార్ట్‌ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది. ఈ చిత్రంలోని పాపులర్‌ గీతం ‘లెట్ ఇట్ గో’ కు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్ ఉత్తమ మ్యూజిక్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. ఫ్రొజెన్ 2 చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల అవుతున్నది.