మహేశ్‌బాబు రాజకీయ ప్రవేశంపై నమ్రత సంచలన వ్యాఖ్యలు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుకు రాజకీయాల్లోకి వచ్చే సమయం లేదంటున్నారు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహేశ్‌ టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని పలు మీడియా వర్గాలు రాశాయి. దాంతో ఈ వార్తలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లోకి మహేశ్‌ అంటూ పలువురు నెటిజన్లు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో నమ్రత ఓ మీడియా ద్వారా ఈ వదంతులపై స్పష్టతనిచ్చారు.

‘మహేశ్‌ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే సమయం లేదు. ఒకవేళ సమయం దొరికినా కుటుంబం కోసం వెచ్చిస్తారే తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరు. రాజకీయాలతో సంబంధం లేని నటుల్లో మహేశ్‌ ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాలూ బాగుండాలని కోరుకుంటారాయన. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినంత మాత్రాన మహేశ్‌ రాజకీయవేత్త అయిపోరు. పాలిటిక్స్‌ గురించి ఆయన నాతోనే సరిగ్గా మాట్లాడరు. ఇక వేదికలెక్కి ప్రసంగాలు ఎలా ఇస్తారు?’ అని వెల్లడించారు నమ్రత.

ప్రస్తుతం మహేశ్‌ ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.