నాగార్జున ‘మన్మథుడు 2’ షురూ..

అక్కినేని నాగార్జున హీరో ‘మన్మథుడు 2’ సినిమా షురూ అయ్యింది. 2002 బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’ కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. రాహుల్‌ రవీంద్రన్‌ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమా ఆరంభోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు నాగ్‌ కుటుంబ సభ్యులు అమల, నాగచైతన్య తదితరులు హాజరయ్యారు. మొదటి సన్నివేశానికి అమల క్లాప్‌ కొట్టారు. చైతన్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

నాగార్జున గత ఏడాది ‘దేవదాస్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన బాలీవుడ్‌ సినిమా ‘బ్రహ్మాస్త్రం’లో నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. రకుల్‌ తమిళంలో సూర్య సరసన ‘ఎన్జీకే’ సినిమాలో, శివ కార్తికేయన్‌ సరసన మరో చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలోనూ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా రూపొందనున్న ‘మర్‌జావా’లోనూ ఆమె సందడి చేయనున్నారు. నటుడిగా అలరించిన రాహుల్‌ రవీంద్రన్‌ ‘చి.ల.సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీని తర్వాత ఆయన తీస్తున్న రెండో సినిమా ‘మన్మథుడు 2’.