మన్మోహన్‌ బయోపిక్‌ పూర్తి: అనుపమ్‌

చిత్ర పరిశ్రమలో గత కొంత కాలంగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. త్వరలోనే మరో బయోపిక్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. ఇందులో మన్మోహన్‌గా ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారు. విజయ్‌ రత్నాకర్‌ గట్టీ దర్శకత్వం వహిస్తున్నారు. బొహ్ర బ్రదర్స్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సోనియా గాంధీగా సజ్జన్‌ బెర్నర్ట్‌ కనిపించనున్నారు. సంజయ్‌ బారు రచించిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.

 

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని అనుపమ్‌ తాజాగా పేర్కొన్నారు. ఈ మేరకు సెట్‌లో తీసిన వీడియోను షేర్‌ చేశారు. ‘అద్భుతమైన సినిమా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ షూటింగ్‌ పూర్తయింది. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. మన్మోహన్‌ సింగ్‌ జీవిత ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఈ సినిమా చేయడానికి ముందు నాలో కొన్ని ఆలోచనలు ఉండేవి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. కానీ ఇవాళ షూటింగ్‌ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదు. మీరు మా సినిమా చూసిన తర్వాత మీతో కలిసి ఓ కప్పు టీ తాగాలని ఉంది’ అని అనుపమ్‌ పేర్కొన్నారు.

అచ్చం అలానే ఉన్నారు.. ఈ సినిమా సెట్లో నటి సజ్జన్‌ బెర్నర్ట్‌తో మాట్లాడుతున్న వీడియోను అనుపమ్‌ షేర్‌ చేశారు. దీన్ని వీక్షించిన నెటిజన్స్ వారు అచ్చం మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీలాగానే ఉన్నారని కామెంట్లు పెట్టారు.

CLICK HERE!! For the aha Latest Updates