‘మన్మథుడు 2’ టీమ్‌ని పరిచయం చేసిన నాగార్జున

అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న ‘మన్మథుడు 2’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నేను, నా ‘మన్మథుడు 2′ కుటుంబం.. లవింగ్‌ ఇట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ను పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో నాగ్‌, రకుల్‌ జంట చక్కగా కనిపించింది. నాగ్‌ కొత్త లుక్‌లో యంగ్‌గా ఉన్నారు. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తోపాటు రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి తదితరులు ఫొటోలో కనిపించారు. ఇదే సందర్భంగా తీసిన మరో ఫొటోను రాహుల్‌ పంచుకున్నారు.

ఇటీవల ‘మన్మథుడు 2’ షూటింగ్‌ ప్రారంభమైంది. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2002లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’కు సీక్వెల్‌ ఇది. అందులో అన్షు, సోనాలీ బింద్రే హీరోయిన్‌లుగా నటించారు. కె. విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.