ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాక్ ప్రధానికి భారత్‌ సమాధానం

జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని.. భారత్‌ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానం ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ… “పాక్‌ ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పుల్వామా ఉగ్రదాడిని ఆయన ఖండించలేదు. అలాగే, వీర జవాన్ల మృతికి ఆయన సంతాపం కూడా తెలపలేదు. ఉగ్రవాదంపై చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమ్రాన్‌ ఖాన్ అంటున్నారు. ‌ఉగ్రవాదం, హింసాయుత వాతావరణం లేకపోతే ధ్వైపాక్షిక చర్చలు జరపడానికి సిద్ధమని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపిందని అన్నారు.

“ఉగ్రవాద చర్యలకు తామే అదిపెద్ద బాధితులం అని పాక్‌ అంటోంది. ఇందులో నిజం లేదు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఓ భాగంగా ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి కేసు విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ పాక్‌ చెప్పింది. దీనిపై ఎటువంటి పురోగతి లేదు. హఫీజ్‌ సయీద్‌ వంటి ఉగ్రవాదులతో ఈ “కొత్త పాకిస్థాన్”ప్రధాని వేదికను పంచుకుంటున్నారు. పుల్వామా ఉగ్రదాడిపై భారత్‌ ఆధారాలు సమర్పిస్తే విచారణ జరుపుతామని పాక్‌ ప్రధాని కుంటి సాకులు చెబుతున్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలను పాక్‌కు ఇస్తే ఏం జరిగింది? పదేళ్లుగా ఈ కేసులో పురోగతి లేదు. పుల్వామా దాడిపై జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్ర సంస్థ చేసిన ప్రకటనలను పాక్‌ ప్రధాని ఒప్పుకోవట్లేదు. అలాగే, ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాది (వీడియోలో) చెప్పిన విషయాన్ని కూడా కొట్టిపారేస్తున్నారు. జైష్‌ ఎ మహ్మద్‌కు, దాని నాయకుడు మసూద్‌ అజర్‌.. పాక్‌కు చెందిన వారని అందరికీ తెలుసు. పుల్వామా ఉగ్రదాడిపై చర్యలు తీసుకోవడానికి ఈ విషయాలే పాక్‌కు కచ్చితమైన ఆధారాలు” అని ప్రకటన చేశారు.