మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు: లోకేష్‌

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలోని స్వగ్రామంతో పాటు హైదరాబాద్ లోని ఇళ్లు, ఆయన ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వరుసగా టీడీపీ నాయకులపై జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిచారు.

మోడీ ఆపరేషన్లో భాగంగా ఆంధ్రులపై దాడి. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలి అని నిలదీసినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు. మొన్న బీద మస్తాన్ రావు, నిన్న సుజనా చౌదరి, ఈ రోజు సిఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు. కడప ఉక్కు…ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఎంపీ సిఎం రమేష్ పై ఐటీ దాడులు. దీక్ష చేసి ఈ రోజుకి వంద రోజులు పూర్తయ్యింది అయినా కేంద్రంలో చలనం లేదు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకుండా చెయ్యాలని మోడీ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల పై ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెన్నక్కి తగ్గేది లేదు. కేంద్రం మెడలు వంచుతాం… హోదా సాధిస్తాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. అంటూ ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.